తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు స్వదేశీ గ్రూప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో తమ స్వదేశీ గ్రూప్ నుంచి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల సమస్యతో పాటు… చాలా చిత్రాలు విడుదల కాకుండానే ఆగిపోతున్నాయి. ఈ సమస్యను తీర్చేందుకు గాను తాము తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 1000 థియేటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. అమెరికాలో ప్రతి 7800 మందికి ఓ థియేటర్ ఉంది. అదే చైనాలో 40000 మందికి ఓ థియేటర్ ఉంది. అదే మన దేశంలో మాత్రం 98000 మంది జనాభాకు ఓ థియేటర్ మాత్రమే ఉంది. అందుకే థియేటర్ల సమస్యను అధిగ మించేందుకు 20 నుంచి 30 వేల జనాభాకు ఓ థియేటర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే చాలా థియేటర్లు కండీషన్ సరిగా లేక, టెక్నికల్ గా అప్ డేట్ కాలేక, నిర్వహణ ఖర్చులు భరించలేక గోడౌన్స్ గాను, మ్యారేజ్ హాల్స్ గా మారుతున్నాయి. అందుకే అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా థియేటర్ల రూపకల్పన చేస్తున్నాం. దీనికి సంబంధించిన భూసేకరణ కూడా జరుగుతోంది. ప్రత్యక్షంగా భూములు కొనడం లేదా లీజు విధానం, లేదా భాగస్వామ్య విధానం ద్వారా భూ సేకరణ చేస్తున్నాం. అలాగే స్వదేశీ షాపింగ్ మాల్స్ లో రెండు థియేటర్లు, స్వదేశీ సూపర్ బజార్, హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. ఈ సూపర్ బజార్ లో అమ్మే కూరగాయలు, నిత్యావవరస వస్తువులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి దాదాపు 10000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాం. వీటితో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ట్రేడ్ సెంటర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ కన్వేషన్ సెంటర్ ను కూడా నిర్మించనున్నాం. సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ తో పాటు… పలు ప్రైవేటు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ఫిల్మ్ ట్రేడ్ సెంటర్ ద్వారా సినిమా వ్యాపారాన్ని సుహృద్భావ వాతావరణంలో చేసుకోవచ్చు. దీంతో పాటు 24 శాఖలకు సంబధించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తున్నాం. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను తలదన్నే రీతిలో ఈ ఇనిస్టిట్యూట్ ఉండబోతోంది. సినిమా అవకాశాల కోసం వేచి చూస్తున్న ఔత్సాహికులను ప్రోత్సహించబోతున్నాం. ఓ సినిమా ప్రారంభించినప్పటి నుంచి విడుదల చేసే వరకు తామే బాధ్యత వహించేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మంచి చిత్రాల్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాజెక్టును ముదుకు తీసుకెళ్తున్నాం. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి వంటి పెద్దలతో ఓ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు స్వదేశీ గ్రూప్ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోంది. మరిన్ని వివరాలుwww.swadeshbank.com ద్వారా తెలుసుకోవచ్చు. అని అన్నారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు, ఏజిఎమ్, స్వదేశ్ గ్రూప్ మాట్లాడుతూ…. పండగ సందర్భాల్లో పెద్ద చిత్రాలు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో చిన్న చిత్రాలు విడుదల అయ్యే అవకాశం లేకుండా ఉంది. ఈ పరిస్థితి నుంచి చిన్న చిత్రాల్ని బతికించేందుకు స్వదేశీ మాల్స్ లో ఏర్పాటు చేస్తున్న థియేటర్లు ఉపయోగపడతాయి. అలాగే స్వదేశీ సూపర్ బజార్స్ ద్వారా నిత్యావసర వస్తువులు కొన్నవారికి ఫ్రీ కూపన్స్ జారీ చేస్తాం. దీని ద్వారా సినిమాలను ప్రీగా వీక్షించేందుకు అవకాశముంది. అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వదేశ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ వాసిరెడ్డి మనోజ్ కూడా పాల్గొన్నారు.