ఎన్‌జెటిఎ – థమన్‌ లైవ్‌ ఈవెంట్‌ సూపర్‌ సక్సెస్‌

7

తెలుగువారికోసం ఏర్పాటైన న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్‌ (ఎన్‌జెటిఎ), వారిని ఆనందోత్సాహాల్లో ముంచెత్తేందుకు విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నామనే భావన కలిగించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్‌, దిల్‌ రాజు, నిఖిల్‌ సిద్దార్ధలతో భారీ ఈవెంట్‌ చేపట్టిన ఎన్‌జెటిఎ, తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌ లైవ్‌ మ్యూజిక్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ప్రముఖ గాయనీ గాయకులు గీతా మాధురి, శ్రీకృష్ణ, సమీరా, దీపు, దీపక్‌ తదితరులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వుడ్‌ బ్రిడ్స్‌ హైస్కూల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కి 1000కి పైగా ఆడియన్స్‌ హాజరయ్యారు. 25 పాటలను ఈ మ్యూజిక్‌ ఈవెంట్‌లో నాన్‌స్టాప్‌గా పెర్ఫామ్‌ చేశారు. స్థానిక వ్యాపారవేత్తలను ఈ సందర్భంగా సన్మానించారు. అలాగే, న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్‌ కమిటీ, ఎస్‌ఎస్‌ తమన్‌ బృందాన్ని ఘనంగా సన్మానించింది. చిన్నా వాసుదేవరెడ్డి, మోహన్‌ పెండ్యాల, మంజు భార్గవ, స్వాతి అట్లూరి (గుండపునీధి), వేణి చిన్నా, అనురాధా అరుణ్‌, ఉజ్వల్‌ కష్టాల, సరల కొమరవోలు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రెసిడెంట్‌ చిన్న వాసుదేవరెడ్డి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, సిరివెన్నెల పేరుతో మాసపత్రికను ప్రారంభిస్తున్నామనీ, అమెరికాలోని తెలుగువారికి, తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికి వారధిలా ఈ మాసపత్రిక పనిచేస్తుందని చెప్పారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రిగారు, తన పేరును పత్రికకు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారనీ, ‘సిరివెన్నెల’ చిత్రాన్ని రూపొందించిన కె.విశ్వనాథ్‌ ఆశీస్సులతో ఈ పత్రికను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు చిన్న వాసుదేవరెడ్డి.

NO COMMENTS

LEAVE A REPLY